కాకినాడ జిల్లా కాకినాడ లోని ప్రగోడా స్కూల్ నందు దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రత్యేక నడక బూట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లబ్ధిదారులకు నడక బూట్లను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి ప్రొఫెషనల్ రింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, "జన్మతః లేదా ప్రమాదవశాత్తు నడవలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ఈ ప్రత్యేక బూట్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ధరించడం ద్వారా పిల్లలు క్రమంగా నడక నేర్చుకుని, భవిష్యత్తులో ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా జీవించగలుగుతారు" అని అన్నారు.
సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగ చిన్నారులను గుర్తించి, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఇలాంటి వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతున్న దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు దుర్గా సోము ప్రసాద్ గారి సేవా దృక్పథం ఎంతోమందికి ఆదర్శమని, ఈ సేవలు మరింత మందికి చేరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

