Hot Posts

6/recent/ticker-posts

కాంగ్రెస్ నాయకత్వం మార్పు అనివార్యమా?


  కాంగ్రెస్ నాయకత్వం మార్పు అనివార్యమా?

 ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా : అవకాశం ఇవ్వాలి... కానీ అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి. పనిచేయలేని నాయకత్వాన్ని పదేపదే భరించడం ప్రజాస్వామ్యానికి కూడా అవమానం. పార్టీకి కూడా ప్రమాదం. పనిచేయలేని వారిని కాపాడటం కంటే పని చేసే వారిని ముందుకు తేవడం అవసరం. ఇదే నిజమైన రాజకీయ బాధ్యత.

 రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలపడాలి అంటే ఒక కఠినమైన నిజాన్ని అంగీకరించాలి.... నాయకత్వం మార్పు తప్పనిసరి... లేదంటే ఎప్పటికీ పార్టీని నిలబెట్టిన " పుంజేడు " నాయకులు కూడా ఒక్కొక్కరిగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం.

  వైయస్ షర్మిల  పై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ ఆమె నాయకత్వం శైలిమీద మాత్రం తీవ్ర అభ్యంతరం ఉంది. ఒక రాష్ట్రానికి అది కూడా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తి రాజకీయ పరిపక్వత బాధ్యత దిశా నిర్దేశం చూపించాలి. పార్టీ క్యాడర్ తో కలిసి పోవాలి, వారి నమ్మకం గెలుచుకోవాలి, పార్టీని తిరిగి బలపరచాలి, కానీ ఇవన్నీ ఆమెలో కనిపించడం లేదు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి  కుమార్తె కావడం ఒక్కటే అర్హతగా భావించి బాధ్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు హై కమాండ్ ఆలోచించిందా... రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటి... నాయకత్వం ఎలా ఉండాలి అని... హై కమాండ్ ఆలోచించినట్టుగా కనబడటం లేదు. 

ఇప్పుడు పరిస్థితి ఏమిటి. కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య ఒక స్పష్టమైన అభిప్రాయం వినిపిస్తోంది... సుంకర పద్మశ్రీ .. షర్మిల కంటే మెరుగైన నాయకురాలు అని. ఇది కేవలం అభిప్రాయం కాదు.. ఫీల్డ్ లో కనిపిస్తున్న వాస్తవం. పద్మశ్రీ  ఫైర్ బ్రాండ్. ఆమె మాట్లాడితే జోష్ ఉంటుంది. ఆమె పని చేస్తే ఫలితం కనిపిస్తుంది. రాజకీయ వారసత్వం లేకపోయినా, పార్టీ పట్ల నిబద్ధత, కష్టపడే స్వభావం, కార్యాచరణ, ఇవే ఆమె బలాలు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ కి కూడా అవే కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది కాంగ్రెస్ అభివృద్ధికి ఒక గొప్ప అవకాశం. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకునే నాయకత్వం లేకపోతే అది వృధా! రాష్ట్ర అధ్యక్షురాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? పార్టీ బలోపేతం చేసే ప్రయత్నాలు ఎక్కడ? ఎందుకు ఎప్పుడూ ఒకే వ్యక్తి పేరు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.? పార్టీ నిర్మాణం,వ్యూహం, క్యాడర్ బలోపేతం, ఇదే కదా ముఖ్యమైనది... మరి అవి ఎక్కడ కనబడుతున్నాయి.

ప్రస్తుత నాయకత్వం వల్ల పార్టీలో జోష్ తగ్గిపోయింది.. ఇది తీవ్ర ఆందోళనకర విషయం.

ఇప్పటికైనా ఢిల్లీ హై కమాండ్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలు కాదు, ఫలితాలు కావాలి, ఫలితాలే ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలంటే... ఒకే ఒక స్పష్టమైన మార్గం ఉంది. " సమర్థ నాయకత్వాన్ని ముందుకు తేవాలి ఆ బాధ్యతలను సుంకర పద్మశ్రీ కి అప్పగిస్తే.... కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వస్తుంది. ఇది కేవలం అభిప్రాయం కాదు, గ్రౌండ్ రియాలిటీ.

లేకపోతే.. పార్టీని కాపాడుకునే చివరి అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

        వల్లూరి రామమోహన్ 

               పొలిటికల్ అనలిస్ట్.