ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి: ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ డిమాండ్
కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత ఆందోళనకరంగా ఉందని ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నాణ్యత లేని భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తక్షణమే నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేసింది. ఈరోజు కాకినాడ నగరంలోని చర్చ్ స్క్వేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల కమిటీని ఏర్పాటు చేసి, అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు కరుణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత కనీస ప్రమాణాలకు దూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చారు కానీ, నాణ్యతలో మాత్రం ఎటువంటి మార్పు లేదని ఆయన విమర్శించారు. పౌష్టికాహారం అందించాల్సిన ఈ పథకం నిర్లక్ష్యానికి గురవడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు.
ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాకుండా, విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పోషక విలువలతో కూడిన, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి, విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాహక్కుల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర నాయకులు కరుణ్, పవన్ కుమార్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
