వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య
కాకినాడ జిల్లా జగ్గంపేట
పురుగుల బియ్యంతో వండిన అన్నంలో.. కుళ్ళిన కూరగాయలతో చేసిన కూర వేసుకుని.. క్షీణించిన పారిశుధ్యంలో కూర్చుని ఎవరైనా భోజనం చేస్తారా..? అని వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య సూటిగా ప్రశ్నించారు. కానీ కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఇది నిత్యకృత్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే తరచుగా ఈ హాస్టల్ విద్యార్థులు విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతుంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హాస్టల్ పేరు చెబితేనే విద్యార్థులు హడలెత్తి పోతున్నారంటేనే ఇక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమౌతుందని ఆవేదన చెందారు.
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపు మేరకు వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాని, జగ్గంపేట నియోజకవర్గం అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్సీ హాస్టల్‌ను పానుగంటి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణాన్ని పరిశీలించి సమస్యల గురించి విద్యార్ధులు నే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్ హయాంలో ఆరోగ్యం, ఆహ్లాదంతో కూడిన వాతావరణం నడుమ పౌష్టికాహారం తింటూ హాస్టల్ విద్యార్థులు చక్కగా చదువుకునే వారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో అదంతా కేవలం ఒక కలలా మిగిలిపోయిందని మండిపడ్డారు. పేద విద్యార్థులంటే కూటమి పాలకులకు ఎంతో చిన్నచూపని నిందించారు. ప్రత్యేకించి ఎస్సీ విద్యార్థులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా అలుసని ఆరోపించారు. అందుకే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఈ అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా వసతి గృహాల సంబంధిత అధికారులు స్పందించి పేద విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందజేసేలా సంబంధిత అధికారులు స్పందించాలని చైతన్య కోరారు వసతి గృహాలు దుర్భర పరిస్థితుల్లో ఉండడానికి కారణం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం అని చైతన్య తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, ముమ్మిడివరం నియోజకవర్గం అధ్యక్షుడు ఆకాశ్, నేతలు దుర్గ, శివ, సూరిబాబు, రమేష్, సుజిత్, వింటి రాజా, విన్స్ తదితరులు పాల్గొన్నారు.

