కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం : జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. దేవరపల్లి చెన్నారావు ఆధ్వర్యంలో భౌతిక మరియు రసాయన శాస్త్ర విభాగాలు సంయుక్తంగా సుస్థిర భవిష్యత్తు కోసం హరిత సాంకేతికతలలో ఇటీవలి (Recent Advances in Green Technologies for Sustainable Future) అంశంపై జాతీయస్థాయి వెబినార్ ను నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన నన్నయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డా. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించి భవిష్యత్ తరాలకు సుస్థిరమైన భద్రతను కల్పించడానికి హరిత సాంకేతిక విజ్ఞానం దోహదపడుతుందని, శాస్త్రవేత్తలు ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు. గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. నూతులపాటి వేణుగోపాల్ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో క్రిమిసంహారక మందులు వాడటంవల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నానో క్రిమిసంహారక మందులు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని, వీటిపై ప్రస్తుతం విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. టాటా స్టీల్ లిమిటెడ్ లో ప్రధాన పరిశోధకునిగా పనిచేస్తున్న డా. ఆకుల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, భవిష్యత్ లో వాహన రంగంలో హైడ్రోజన్ ఇంధన వినియోగం విస్తృతంగా వినియోగించే అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకుడు వారణాసి మల్లికార్జున శర్మ, భౌతికశాస్త్ర అధ్యాపకుడు డా. గోపాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 100 మంది అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

