కాకినాడ జిల్లా జగ్గంపేట : జగంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అని విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లోని రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సున్నితంగా హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులను ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకునే విధంగా ర్యాలీలు చేపట్టి తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి అవసరమైతే నేను కూడా ఇంటింటికి తిరుగుతానని ఆయన ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా ఫ్యాన్లు, పాఠశాలలకు రంగులు, మైనర్ రిపేర్సు చేయించడం జరుగుతుందని, విద్యార్థిని విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధిచేసిన మంచినీళ్లు కూడా అందిస్తామని ఆయన తెలియజేశారు.


