Hot Posts

6/recent/ticker-posts


 అభివృద్ధి-సంక్షేమాల 'డబుల్ ఇంజిన్' బడ్జెట్: కూటమి సర్కార్‌పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశంసల జల్లు

రూ. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ కచ్చితంగా ఖర్చు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం... ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట,  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అద్భుతమని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కొనియాడారు. 

ఆదివారం స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో ఆయన పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రూ. 3,32,205 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ అటు మౌలిక సదుపాయాల కల్పనను, ఇటు పేదల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 11 మంది సభ్యులతో 11వ తేదీన 11 నిమిషాలు మాత్రమే ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై కాకుండా తమకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం చిన్నపిల్లలు ఆటలో అరటిపండు మాదిరిగా ఉందని ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేశారని గుర్తించుకోవాలని అన్నారు. 

రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి జోన్ 1 లో ఉన్న మన ప్రాంతానికి 28 వేల కోట్లు కేటాయించి శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధను ఆయన ప్రశంసించారు. గత ఏడాది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ. 18,848 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని ఏకంగా రూ. 22,942 కోట్లకు పెంచడం ద్వారా పల్లెల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ముఖ్యంగా జన వనరుల శాఖకు 28వేల కోట్లు రూపాయల కేటాయించి రాష్ట్రంలో అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారని ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు 91% పూర్తి చేసుకోవడం జరిగిందని నూటికి నూరు శాతం చంద్రబాబు నేతృత్వంలోనే పూర్తవుతుందని అన్నారు. మన ప్రాంతంలో తాళ్లూరు లిఫ్ట్ కు 52 కోట్ల రూపాయలు మంజూరై ఉన్నాయని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని అన్నారు. 

పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖకు అధిక శాతం నిధులు కేటాయించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ రోడ్లు పూర్తి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడలేదని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో 'జల జీవన్ మిషన్'కు నిధులను రూ. 4,000 కోట్లకు పెంచడం ద్వారా మహిళల కష్టాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అదేవిధంగా, నిరుపేదలైన వృద్ధులు, వితంతువులకు కొండంత అండగా నిలిచే 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల కోసం రూ. 27,719 కోట్లు కేటాయించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి భారీ లక్ష్యాలతో పాటు, ఎన్నికల హామీలైన 'సూపర్ సిక్స్' పథకాలకు నిధుల కేటాయింపు ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకుందని, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. 

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప య్యావుల కేశవ్ కి, అచ్చం నాయుడు కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆత్మ చైర్మన్ పైడిపాల సూరిబాబు, పిల్లా చంటిబాబు, అనుకుల శ్రీకాంత్, సర్వసిద్ధి లక్ష్మణరావు, పీల మహేష్, వైబోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, దాసరి సీతారామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.