కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఈ నెల 8, 9, 10వ తేదీలలో కాకినాడ జిల్లాలో పిఠాపురం మరియు కాకినాడ నియోజకవర్గాలలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
పర్యటన ప్రాంతాలలో బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ రోజు సంబంధిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ కాలేజ్ గ్రౌండ్, ఆర్ & బి గెస్ట్ హౌస్‌తో పాటు కాకినాడలోని RMC RAMCOSA ప్రాంగణాలను సందర్శించి, అక్కడ అమలు చేయాల్సిన భద్రతా విధానాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాలలో ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.
ట్రాఫిక్‌కు ముందస్తు ప్రణాళిక రూపొందించి అవసరమైన మార్గమళ్లింపులు చేయాలని, అత్యవసర పరిస్థితుల నివారణకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్ AR అడిషనల్ ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ASP దేవరాజ్ మనీష్ పాటిల్ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, AR డీఎస్పీ వి. శ్రీహరి రావు, పిఠాపురం సీఐ జి. శ్రీనివాసరావు మరియు సంబంధిత ఎస్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

