Hot Posts

6/recent/ticker-posts

ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సవాల్ విసిరిన సూర్యచంద్ర



ఎన్నికల హామీలు అటకెక్కించి.. నిస్సిగ్గుగా విజయోత్సవాలా?

కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం బూరుపూడి: గ్రామంలో తమ స్వగృహం నందు పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరకొర పనులు చేసి, పూర్తిగా హామీలు నెరవేర్చినట్టు మహాసభలు నిర్వహించడం ప్రజలను వంచించడమేనన్నారు.​

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని సూర్యచంద్ర విమర్శించారు.​మహిళలకు ప్రతి నెల ఇవ్వాల్సిన 1500 ‘మహాశక్తి’ పథకం ఏమైందని,​నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామన్న హామీ ఏ తీరానికి చేరిందని,​కౌలు రైతులకు 20,000 సాయం ఎక్కడని,​ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న మాట ఏమైందని,​వృద్ధులు,వితంతువులు, వికలాంగుల పింఛన్ల పరిస్థితి ఏంటని, కాపు,ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఉత్సవాలు ఎలా చేసుకుంటారని సూర్యచంద్ర ప్రశ్నించారు.

​"జగ్గంపేట నియోజకవర్గంలో 25 వేల ఇళ్లు నిర్మిస్తాం... 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం" అని నమ్మబలికిన ఎమ్మెల్యే కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్  ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా మర్చిపోయారని సూర్యచంద్ర మండిపడ్డారు. హామీల అమలులో సున్నా సాధించిన వీరు 200 కోట్ల అవినీతి మార్కును దాటి దోపిడీలో మాత్రం రికార్డు సృష్టించారని ఆరోపించారు.

ఎన్నికల ముందు ఏలేరు నది ఆధునీకరణ చేస్తామన్నారు,తీరా గెలిచాక ఏలేరులోని ఇసుక మొత్తాన్ని దోచేస్తూ ఇసుక మాఫియాగా మారారన్నారు.మల్లవరం ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు నేటికీ పనులు మొదలుపెట్టలేదన్నారు.ఎన్నికల ముందు ​కిర్లంపూడి, గోకవరం మండలాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు అన్నారు నేడు ఆ ఊసే లేదు. గెలిచిన వెంటనే గోకవరంలో ఫైర్ స్టేషన్, సంత మార్కెట్  నిర్మిస్తామన్నారు గెలిచి రెండేళ్లయిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. గ్రామాల్లో సీసీ డ్రెయిన్లు నిర్మిస్తామన్న మాట నీటిమూటలైంది ,

"స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరిగింది కేవలం 10 శాతం అభివృద్ధే.. కానీ అవినీతి మాత్రం 90 శాతం జరిగిందన్నారు."

ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, అవినీతిని ప్రశ్నిస్తున్న తమపై తప్పుడు కేసులు బనాయించడం చేతగానితనానికి నిదర్శనమని కేసులకు భయపడమని ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని సూర్యచంద్ర స్పష్టం చేశారు.

రేపు జగ్గంపేటలో జరగబోయే కూటమి విజయోత్సవ మహాసభ వేదికగా.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ఏ తేదీలోగా, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన 'యాక్షన్ ప్లాన్' ప్రకటించాల్సిన బాధ్యత శాసనసభ్యులు  జ్యోతుల నెహ్రూ  పై ఉందని, ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు.