ఘనంగా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు.
కాకినాడ జిల్లా :జగ్గంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ డా.డి. చెన్నారావు ఆధ్వర్యంలో, తెలుగు శాఖాధిపతి డా.డి. సత్యలత ప్రముఖ తెలుగు కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు మాట్లాడుతూ, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అనే సందేశం ద్వారా దేశభక్తి, మానవతా విలువలను ప్రజల్లో పెంపొందించారని తెలిపారు. సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, బాల్యవివాహాలు వంటి సామాజిక సమస్యలను తన రచనల ద్వారా ప్రశ్నించి, సంస్కరణలకు మార్గం చూపారని అన్నారు.
తెలుగు శాఖాధిపతి డా. డి. సత్యలత మేడమ్ మాట్లాడుతూ, గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శకుడని, ఆయన రచనలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని వివరించారు. "కన్యాశుల్కం" వంటి నాటకం ద్వారా సమాజంలోని దురాదారాలను ఎత్తిచూపి, సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. విద్యార్ధులు గురజాడ సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ అప్పారావు జీవిత విశేషాలు, సాహిత్య సేవలు, సామాజిక సంస్కరణలపై ప్రసంగాలు చేశారు. ఆయన రచనలు, తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు. గురజుడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ సిహెచ్ బాలరాజు , ఐ. క్యూ.ఏ. సి కో-ఆర్డినేటర్ డా.పి.వి.వి. సత్యా నారాయణ , కామర్స్ ఆధ్యాపకులు, పి.పద్మ శేఖర్ , ఆంగ్ల ఆధ్యాపకులు వై. ఏ.ఎస్. శ్రీనివాస్, జువాలజీ ఆధ్యాపకులు పి. శ్రీనివాస రావు , హిస్టరీ ఆధ్యాపకులు ఆర్. శ్రీనుగారు, బోటాని అధ్యాపకురాలు వై.నవీన , గణిత ఆధ్యాపకురాలు కె.టి. నాగ జ్యోతి , భౌతికశాస్త్ర ఆధ్యాపకులు పి.శేఖర్ ఇతర అధ్యపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

