ఇచ్చిన హామీలు నెరవేర్చని వారికి ఓటు వేసే ముందు ఆలోచించండి.. ప్రజలారా!
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి.
కాకినాడ జిల్లా. జగ్గంపేట నియోజకవర్గం: కిర్లంపూడి మండలం, బూరుగుపూడి గ్రామంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర తమ నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, గెలిచి గద్దెనెక్కి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని కూటమి ప్రభుత్వం నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే ముందు అభ్యర్థుల మాటలను కాకుండా, వారి గత పనితీరును, ప్రజలకు చేసిన సేవలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక గుర్తుకు వేసే ముద్ర మాత్రమే కాదని, మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి అని సూర్యచంద్ర పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మి మరోసారి మోసపోకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజా సమస్యలపై ప్రశ్నించే, పరిష్కారాల కోసం పోరాడే అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజల గొంతుకు మరింత బలం చేకూర్చేందుకే మా పోటీ
జగ్గంపేట నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నానని సూర్యచంద్ర తెలిపారు. ఈ పోరాటానికి స్థానిక సంస్థల్లోనూ ప్రజాప్రతినిధుల మద్దతు అవసరమని, అందుకే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని వెల్లడించారు.ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తే, గ్రామస్థాయి సమస్యలను మరింత బలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూర్యచంద్ర అన్నారు.
కిర్లంపూడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తన భార్య పాటంశెట్టి శ్రీదేవి పోటీ చేస్తున్నారని, ఆమెను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అలాగే బూరుగుపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుం మల్లేష్‌ను గ్రామ ప్రజలు ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
భయపెట్టడం, భయపడడం ఎమ్మెల్యే జ్యోతుల నె.హ్రూ నైజం
జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ భయభ్రాంతుల వాతావరణంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఉద్దేశించి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో భయపెట్టేది ఎవరు? భయపడేది ఎవరు? అనే అంశంపై తాను ఆధారాలతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.“ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నా బాధ్యత. ప్రజల తరఫున మాట్లాడే గొంతుకను ఎవరూ అణచివేయలేరు. నేను చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే గారు ముందుకు వస్తే, ఎక్కడకు చర్చకు పిలిచినా ఆధారాలతో సహా రావడానికి సిద్ధంగా ఉన్నాను” అని సూర్యచంద్ర స్పష్టం చేశారు.
ప్రజల కోసం పనిచేసే అభ్యర్థులను గెలిపించండి.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకులను స్థానిక సంస్థలకు ఎన్నుకోవాలని సూర్యచంద్ర కోరారు. తాను బలపరుస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపిస్తే, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు బలం చేకూరుతుందని అన్నారు.
“వ్యక్తులను చూసి కాదు.. వారి ఆలోచనలను, ప్రజల కోసం చేసిన పనులను చూసి ఓటు వేయండి.
హామీలు ఇచ్చేవారిని మాత్రమే కాదు, వాటిని నెరవేర్చే బాధ్యత తీసుకునేవారిని ఎన్నుకోండి. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలకు బలం చేకూర్చండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి” అని పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
