ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 13 : జగ్గంపేటలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ధన సత్తెమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ వేడుక అత్యంత భక్తి శ్రద్ధలతో, కన్నుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
జగ్గంపేట శెట్టిబలిజ పేటలోని శ్రీ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం నుండి మంగళవారం వందలాది మంది మహిళలు పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని, కోలాహలంగా, భక్తి పారవశ్యంతో పచ్చని పొలాల నడుమ కొలువైన ధన సత్తెమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు.
మహిళలు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి నామస్మరణ చేస్తూ, కొందరు మహిళలకు అమ్మవారు పూనడంతో వీరంగ నృత్యాలు చేస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్న దృశ్యం భక్తులను పులకింపజేసింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు వైభోగుల కొండబాబు యాదవ్, రిస్ రమణ* మాట్లాడుతూ... "ధన సత్తెమ్మ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన మహిమాన్విత దేవత. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో 2019లో గ్రామ పెద్దలు, దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించాము. ఇక్కడ అర్ధనారీశ్వరుని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాము. గత నాలుగేళ్లుగా దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, మహిమగల తల్లిగా భక్తులు అమ్మవారిని కొలుస్తున్నారు" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వైభోగుల కొండబాబు యాదవ్, జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, వేములకొండ జోగారావు, ఎస్ఏ గపూర్,కాకర నాగేశ్వరరావు, వాన శెట్టి సూరిబాబు, వానశెట్టి గుర్రయా పాలికి వీరబాబు, సిమ్మ ముత్యాలు కొప్పు అర్చన, సం గిరెడ్డి శ్రీను,గ్రామ పెద్దలు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.


