టీటీడీ ఉద్యోగుల 15 ఏళ్ల కల నెరవేరింది.. రూ.232 కోట్లతో మౌలిక వసతులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన..!!
తిరుపతి: టీటీడీ ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యకు నేటితో పరిష్కారం లభించిందని *జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ హర్షం వ్యక్తం చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో రూ. 232 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు వర్చువల్ విధానం ద్వారా ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ - గత ప్రభుత్వాలు ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్లక్ష్యం వహించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ దీర్ఘకాల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగులకు సొంత ఇంటి కల నెరవేరడం చాలా సంతోషకరమని తెలిపారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంతో పాటు తిరుమల అభివృద్ధి కూడా అన్ని విధాలుగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ అధికారులు, టీటీడీఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


