కాకినాడ జిల్లా, జగ్గంపేట, :విజయదశమి శరన్నవరాత్రుల సందర్భంగా జగ్గంపేట దేవి సెంటర్ లో వెలసిన శ్రీ లలితా భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
నవరాత్రులలో భాగంగా ఆరో రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లని వస్త్రధారణలో, చేతిలో వీణతో సాక్షాత్తు చదువుల తల్లిగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ఈ పూజల్లో సుమారు 225 మంది మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ఆలయ అర్చకులు మామిళ్లపల్లి రామకృష్ణ, వారి కుమారుడు అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.
ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ కమిటీ వారు ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్తలు నాళం గోపి, నాళం సూరిబాబు, తాండ్రోతు వెంకట రమణ, లక్ష్మణరావు, సోమసుందరం, పెండెం జయరాం, కేసుబోయిన చిన్ని, బీర్వాల చిన్నా, ఇమ్మెళ్ల రాజు, కొండపల్లి రామ్మూర్తి, జ్యోతి, వైభోగుల కొండబాబు యాదవ్ తదితర కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

