కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గంపేటలో పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో రావులమ్మ నగర్ టీడీపీ కార్యాలయం నుండి గండేపల్లి మండలం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. “ఇంధనం పొదుపే దేశానికి మేలుకొలుపు”, “సైకిల్ తొక్కుదాం - భూమిని కాపాడుదాం”, “ప్లాస్టిక్ వద్దు - పచ్చదనం ముద్దు” అనే నినాదాలతో కూడిన ప్లే కార్డులు ప్రదర్శిస్తూ వందలాది కార్యకర్తలు, యువత ఉత్సాహంగా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ, నవీన్ మాట్లాడుతూ:
“పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రతి పౌరుడి కర్తవ్యం. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం కట్టుబడి ఉంది. నేను పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎలక్ట్రానిక్ సైకిల్ తీసుకుని ఆ సైకిల్ వాడడం జరుగుతుందని నాయకులు అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.
సైకిల్ తొక్కడం ఒక్కటే మూడు లాభాలు:
1. ఆరోగ్యానికి మేలు - గుండెకు భరోసా, ఊపిరితిత్తులకు ఊపు 2. జేబుకు మేలు - పెట్రోల్ ఖర్చు మిగులు, 3. భూమికి మేలు - కాలుష్యం నివారణ, భవిష్యత్తుకు మేలు ప్రతి ఇంట్లో మొక్క నాటాలి. ప్రతి వీధిలో ప్లాస్టిక్ వద్దనాలి. ఇంధనం పొదుపు చేస్తేనే వచ్చే తరాలకు భూమి మిగులుతుంది. ఇదే అసలైన దేశభక్తి. ర్యాలీ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.

